: 'నువ్వొకటంటే నేను రెండంటా'... టీడీపీ Vs టీఆర్ఎస్!


టీఆర్ఎస్, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ అధ్యక్షుడే లక్ష్యంగా టీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతుండగా వారికి తగ్గట్టుగా టీడీపీ కూడా సమాధానమిస్తోంది. దీంతో రెండు పార్టీలూ 'నువ్వొకటంటే నేను రెండంటా' చందంగా విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. 'టీడీపీ 420 పార్టీ' అంటూ టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.

బాబు చరిత్రంతా నలుపేనని, కార్యకర్తల పార్టీని కాంట్రాక్టర్ల పార్టీగా బాబు మార్చేశాడని మండిపడ్డారు. కేటీఆర్ పై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీకి సభాహక్కుల ఉల్లంఘన నోలీసులు ఇస్తామని హెచ్చరించారు. నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరిల అసలు రంగులు బయటపెడతామన్న ఈటెల, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొవ్వూరు ఎమ్మెల్యే రామారావును ఎందుకు తొలగించరని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మోత్కుపల్లి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ చరిత్ర అందరికీ తెలిసిందేనని, ఆస్తులపై విచారణ జరిపించాలంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని సినిమాల విడుదల అడ్డుకుంటామని వసూళ్లకు పాల్పడిందెవరో, కాంట్రాక్టర్లను బెదిరించిందెవరో అన్నీ బయటకు వస్తాయన్న మోత్కుపల్లి, టీఆర్ఎస్ బాగోతాలు బయటపడే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News