: 'ఫేస్ బుక్ కు లాల్ సలామ్' అంటున్న మావోయిస్టులు
చేతిరాతతో కూడిన లేఖలు, వాల్ పోస్టర్లతో దశాబ్దాలుగా ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ వచ్చిన నక్సలైట్లు మారుతున్న కాలానికి అనుగుణంగా తామూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల బాట పడుతున్నారు. కాలం చెల్లిన ప్రచార పంథాను వీడి ప్రజలు మెచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తామూ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటిదాకా గ్రామాల్లోనే పట్టుసాధించిన నక్సల్స్ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రాబల్యం పెంచుకోలేకపోయారు.
ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ప్రచారం చేయడం లాభిస్తుందని నక్సల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఫేస్ బుక్ లో పలు పేజీలను తమ పేరిట రూపొందించుకున్నాయి. వాటిలో 'నక్సలిజం కమ్యూనిటీ', 'నక్సల్', 'నక్సల్బరీ హమిజ్', 'నక్సల్ చత్తీస్ గఢ్', 'నక్సలైట్ కమ్యూనిటీ' లు ప్రముఖమైనవి.
కాగా, ఇటీవలే బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ కాన్వాయ్ పై దాడి చేసి 27 మందిని చంపేసిన ఘటనపై నక్సలిజం కమ్యూనిటీ పేజిలో వివరణాత్మక కథనం రాయగా.. 404 మంది లైక్ చేయడం విశేషం. ఈ పేజీల్లో తమ సిద్ధాంతాలు, భావజాలం భారీ ఎత్తున నింపుతూ మావోయిస్టులు నిఘా వర్గాలకు సవాల్ విసురుతున్నారు. ఇటీవలే చత్తీస్ గఢ్ ప్రభుత్వం.. 'నక్సల్ చత్తీస్ గఢ్' అనే ఫేస్ బుక్ పేజీని బ్లాక్ చేయించి, ఎదురుదాడి మొదలెట్టింది.