: ఇంటర్ నెట్లో భారతీయ మహిళలు ఏం చూస్తారు?
కవల పిల్లల్ని కనడం ఎలా? చీర కట్టుకోవడం ఎలా? చాకొలెట్ కేక్ ఎలా తయారుచేస్తారు? చుండ్రు పోవడం ఎలా?.. భారతీయ స్త్రీలు ఇంటర్ నెట్లో ఎక్కువగా సంధించే ప్రశ్నలివి. గూగుల్ ఇండియా జరిపిన సర్వేలో తేలిన విషయమిది. దీనికి సంబంధించిన విమెన్ అండ్ వెబ్ స్టడీ ఆసక్తికరమైన నిజాలను బహిర్గతం చేసింది.
మహిళలు ఎక్కువగా వెతికే వాటిలో దుస్తులు, ఏక్ససరీస్ దే తొలిస్థానం. ఫుడ్, డ్రింక్ ది రెండో స్థానం, పిల్లల పెంపకం మూడోస్థానంలో ఉంది. అయితే చర్మ సౌందర్యం కంటే కేశ సంపదను సంరక్షించుకోవడంపైనే మగువలకు ఎక్కువ శ్రద్ధ ఉందట. అందుకే నాలుగో స్థానంలో కేశ సంరక్షణ, ఐదో స్థానంలో చర్మ సౌందర్యం నిలిచాయి.
60 మిలియన్ల భారతీయ స్త్రీలు భారతదేశంలో ఇంటర్నెట్ చూస్తారు. వారిలో 24 మిలియన్ల మంది రోజూ చూస్తారు. 15 - 35 వయసు స్త్రీలే ఎక్కువగా నెట్ చూస్తారు. వీరిలో ఎక్కువమంది ఇంటి దగ్గరే చూస్తారు' అని ఈ స్టడీ వెల్లడించింది. ఆన్ లైన్ షాపింగ్ చేసే భారతీయుల్లో 10 మిలియన్ల మందిలో 5 మిలియన్ల మంది అతివలే కావడం గమనార్హం. భారతదేశంలో యూ ట్యూబు వీక్షించిన 50 మిలియన్ల జనాల్లో 40 శాతం స్త్రీలు ఉన్నారు.