: నేటి నుంచి భారత్ లో బ్రిటన్ ప్రధాని పర్యటన
భారత్-బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, వాణిజ్యాన్ని మరింత రెట్టింపు చేసే లక్ష్యంతో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఇందు కోసం ఆయన ఇంతకు క్రితమే ముంబయ్ చేరుకున్నారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఆయన మనదేశంలో పర్యటిస్తారు. కామెరూన్ వెంట అత్యున్నత స్థాయి వాణిజ్య బృందం కూడా వుంది. ముందుగా ముంబై లోని హిందుస్థాన్ యూనిలీవర్ ప్రధాన కేంద్రాన్ని బ్రిటన్ ప్రధాని సందర్శిస్తారు. అనంతరం తాజ్ పాలెస్ హోటల్ లో జరిగే భారత్-బ్రిటన్ వాణిజ్యవేత్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు.
రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై మంగళవారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ తో కామెరూన్ సమావేశమవుతారు. అదే రోజు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీనీ ఆయన కలుస్తారు. భారతీయ విద్యార్ధులను వారి దేశంలో నియంత్రించేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పర్యవసానంగా తలెత్తిన విభేదాలను కామెరూన్ ఈ సందర్భంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. 2010 జులైలో ఇండియాలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని మరల రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారత్ లో పర్యటిస్తున్నారు.