: దేశ ఆర్థిక వ్యవస్థకు రూపీ మంటలు


హమ్మయ్య... మాంద్యం నుంచి తేరుకుంటున్నామయ్యా.. అంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అదను చూసి రూపాయి కోరలు చాచింది. మన రూపాయి మన దేశ ఆర్థిక రంగాన్ని కాటేయడానికి తయారైంది. రూపాయి విలువ పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. ఫారెక్స్ మార్కెట్లో రెండేళ్ల క్రితం డాలర్ తో రూపాయి మారకం విలువ 43 రూపాయల దగ్గర ఉంది. అంటే నాడు ఒక డాలర్ కోసం 43 రూపాయలు ఇస్తే సరిపోయేది. నేడు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 60 దగ్గర ఉంది. అంటే నేడు ఒక డాలర్ కోసం 17 రూపాయలు ఎక్కువగా సమర్పించుకోవాలన్నమాట. మరి, ఈ అదనపు భారం ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి.

క్షీణించిన రూపాయి విలువ కారణంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగనారంభించాయి. ఇప్పటికే ఎల్జీ కంపెనీ తన ఉత్పత్తుల ధరలను 5 శాతం పెంచేసింది. బ్లూస్టార్ 7 శాతానికి పైగా పెంచేసింది. హయర్ ఇండియా వచ్చే నెలలో ధరలు పెంచుతామని ప్రకటించింది. కార్ల తయారీదారులు కూడా రూపాయిని పరిశీలిస్తున్నామని, పరిస్థితి ఇలానే ఉంటే ధరలు పెంచక తప్పదని స్పష్టం చేశారు.

దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి సరిపడ స్థాయిలో లేదు. దీంతో దిగుమతి చేసుకుంటేనే గానీ ప్రతీ ఇంట్లో వంట పూర్తయ్యే పరిస్థితి నేడు లేదు. ప్రముఖ ఆయిల్ విక్రయ కంపెనీలు ఐదు రోజుల క్రితం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కేజీకి 3 నుంచి 5 రూపాయలు ఎగబాకాయి. వచ్చే వారంలో మరోసారి పెంపు ఉంటుందని స్పష్టం చేశాయి. ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ 3రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 102 డాలర్ల దగ్గరే ఉంది. కానీ రూపాయి విలువ తగ్గినందువల్ల పెట్రోల్, గ్యాస్ ధర పెంచారు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ భగ్గుమనక మానదు. ఇక బంగారం కూడా అంతర్జాతీయ మార్కెట్లో కంటే భారత్ లోనే ఎక్కువగా ధర పలుకుతోంది. దీనికి కూడా రూపాయే ప్రధాన కారణం. ఇలా దిగుమతుల వ్యయం పెరిగి, వినియగం తగ్గడం వల్ల ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు పెరిగి దేశీయ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.

  • Loading...

More Telugu News