: పొల్లాచ్చి వెళ్ళి నిరాశగా తిరిగొచ్చిన ఎన్టీఆర్ టీమ్
అందమైన లొకేషన్లు ఎక్కడ ఉంటే అక్కడికి టాలీవుడ్ చిత్ర బృందాలు క్యూ కడతాయి. ఇటీవలి కాలంలో కేరళలోని పొల్లాచ్చి ప్రాంతం మనవాళ్ళను విశేషంగా ఆకర్షిస్తోంది. పచ్చని పంటపొలాలు, వెండి జలతారులా మెరిసే నీటి కాలువలు, నునుపైన కొండలతో ఇక్కడ ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. ప్రేక్షకులకు కావలసింది అదేకదా. ఇంకేం, జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం రామయ్యా వస్తావయ్యా షెడ్యూల్ ను కూడా పొల్లాచ్చిలో చిత్రీకరించాలని నిర్ణయించారు. షూటింగ్ కోసమని ఎంతో ఉత్సాహంగా కేరళ పయనమైన చిత్ర బృందం అంతకంటే నిరాశతో హైదరాబాద్ తిరిగిరాక తప్పలేదు.
కారణం, పొల్లాచ్చిలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయట. దీంతో, ఆ షూటింగేదో ఇక్కడే కానిచ్చేద్దామని కొత్త షెడ్యూల్ కు ప్లాన్ చేశాడు చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కాలేజి స్టూడెంట్ పాత్ర పోషిస్తుండగా.. సమంత, శృతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. కాగా, ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ కానుంది.