: మరో సారి బంతి పట్టిన ధోనీ... 4-0-17-0
ధోనీకి ఆల్ రౌండర్ అనిపించుకోవాలన్న ముచ్చట మిగిలిపోయింది. వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా ఉన్నత శిఖరాలధిరోహించిన ధోనీకి బౌలర్ గా పేరు తెచ్చుకోవాలన్న కోరిక మిగిలిపోయింది. తొలిసారి న్యూజిలాండ్ సిరీస్ టెస్టులో బంతి పట్టిన ధోనీ ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసి 5 పరుగులు సమర్పించుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్ సిరీస్ లో బౌలర్ల జోరుతో బంతి పట్టుకున్న ధోనీ 11 ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడా వికెట్ పడకపోవడంతో మరోసారి పాక్ పై రికార్డు సృష్టించేందుకు పూనుకుని బంతి తీసుకున్నాడు ఇక్కడ ఒకే ఓవర్ కి 13 పరుగులు సమర్పించి తన ప్రయత్నం విరమించుకున్నాడు.
అప్పటివరకూ అన్ని టెస్టుల్లో నే బౌలింగ్ చేసిన ధోనీ విండీస్ పర్యటనలో వన్డేలో తొలిసారి బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లు బౌల్ చేసిన ధోనీ 12 పరుగులిచ్చాడు. ఇక ప్రయత్నించలేదు. చాలా కాలం తరువాత భువనేశ్వర్, ఇషాంత్ ల స్పూర్తితో బంతిపట్టిన కెప్టన్ ధోనీ 4 ఓవర్లు ఏకధాటిగా బౌలింగ్ చేసి 4.25 ఎకానమీతో 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అప్పటివరకూ తడబడ్డ లంకేయులు కుదురుకున్నారు.