: 'కొలవెరి బాబోయ్' అంటున్న ధనుష్
'కొలవెరి ఢీ' అంటూ దక్షిణాది హీరో ధనుష్ పాడిన సోలో సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతాకాదు. '3' సినిమాకుగాను ఆ పాటను ధనుషే రచించాడు. కుర్ర స్వరకర్త అనిరుధ్ రవిచందర్ ట్యూన్ చేశారు. అప్పట్లో ఎక్కడ విన్నా ఇదే పాట. అంతగా జనాల నోళ్ళలో నానిన పాట మరోటి లేదంటే అతిశయోక్తికాదేమో. అయితే, అందరినీ అంతగా అలరించిన ఆ గీతం అంటే ఇప్పుడు తనకు వెగటు పుడుతోందని అన్నాడు ధనుష్.
ఎక్కడికెళ్ళినా ఆ పాటతో తనను ముడిపెడుతున్నారని వాపోయాడు. ఇంకెప్పుడు ఆ పాటను ఎక్కడా పాడనని శపథం చేస్తున్నాడీ రజనీకాంత్ గారి అల్లుడు. తనను వెంటాడే ఆ పాటకు ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కాగా, ధనుష్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం 'రాన్ జానా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార నిమిత్తం ధనుష్ ముంబయిలోని రేడియో మిర్చి ఎఫ్ఎం రేడియో కేంద్రంలో సందడి చేశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు.