: ఊపందుకున్న సహాయ, పునరావాస కార్యక్రమాలు
ఉత్తరాఖండ్ లో వాతావరణం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. గంగా, యమున పరవళ్లతో ఉక్కిరిబిక్కిరై తల్లడిల్లిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వాతావరణం కాస్త సహకరిస్తోంది. దీంతో పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 23 హెలీకాప్టర్లతో సుమారు 2500 మందిని సురక్షిత ప్రాంతాలకు భద్రతాదళాల సహాయంతో తరలించారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 26000 మందిని అధికారులు రక్షించారు అయితే మరో 40000 మంది యాత్రీకులను, స్థానిక వరదబాధితులను ఇంకా రక్షించాల్సి ఉంది. వీరిని రక్షించేందుకు ఇండోటిబెటన్ బోర్డర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ ఎన్ ఫోర్సు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఉత్తర ప్రదేశ్ పోలీసుల సాయంతో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది.
వీరు కాకుండా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు న్యూఢిల్లీ నుంచి మరో రెండు బృందాలను అధికారులు పంపించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అదనపు హెలీకాప్టర్లు సమకూర్చుకోవాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పునరావాస చర్యలపై నివేదికను ఈ 25 లోపు సమర్పించాలని కోరింది.