: కిర్ స్టెన్ నోటా అదేమాట!
లీగ్ దశలో వారికి తిరుగుండదు.. ప్రత్యర్థి ఎంతటి జట్టయినా మట్టికరిపిస్తారు. వారి అమ్ములపొదిలో అన్ని అస్త్రాలూ ఉంటాయి. అగ్రశ్రేణి బ్యాటింగ్ లైనప్ లను సైతం వణికించే పేస్ వనరులు ఆ జట్టులో పుష్కలం. ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల టాప్ టెన్ జాబితాలో ఆ జట్టుకు చెందిన ఆటగాళ్ళు ఎప్పుడూ ఒకరో ఇద్దరో ఉండడం సాధారణం. ఇన్ని అసాధారణతలు ఉన్న జట్టు దక్షిణాఫ్రికా అని క్రికెట్ తో పరిచయమున్న ఎవరైనా చెప్పేస్తారు. కానీ, సెమీఫైనల్, ఫైనల్ వంటి నిర్ణయాత్మక మ్యాచ్ లలో మాత్రం సఫారీలది పేలవ రికార్డే. ఆ విషయం గత మేజర్ టోర్నీలను పరికిస్తే తెలుస్తుంది.
చిన్నజట్ల చేతిలో సైతం చిత్తవుతుంటారు. కించిత్ ఒత్తిడిని సైతం తాళలేక కుప్పకూలుతుంటారు. ఉన్న ప్రతిభను వెలికితీయలేక జావగారిపోతుంటారు. దీంతో, సఫారీ ఆటగాళ్ళపై అందరూ 'చోకర్స్' (కుప్పకూలేవాళ్ళు) అనే ముద్రవేశారు.
అయితే, 'చోకర్స్' అని ఎవరన్నా అంటే ఆ జట్టు యాజమాన్యం ఇప్పటివరకు ఘాటుగానే బదులిస్తూ వచ్చేది. కానీ, ఇప్పుడు సాక్షాత్తూ సఫారీ టీమ్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ తాము 'చోకర్స్' మే అని అంగీకరించాడు. బుధవారం ఇంగ్ల్లండ్ తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఓటమి అనంతరం కిర్ స్టెన్ మీడియాతో మాట్లాడాడు.
'మేం నిజాయతీగా కొన్ని విషయాలు అంగీకరించాల్సి న సమయమిది. ఈ రోజు కూడా మేం కుప్పకూలాం అనుకుంటున్నా. ఇలా మాట్లాడడం కష్టమే అయినా తప్పడంలేదు' అని పేర్కొన్నాడు. నిన్న లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన సెమీస్ లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.