: కొంత మంది పోలీసుల తీరుతో దేశానికి అప్రదిష్ట: సుప్రీంకోర్టు


ముంబై పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు ఉగాండా పౌరులను దేశం విడిచి వెళ్లకుండా అడ్డుపడినందుకు మొట్టికాయలు వేసింది. ఉగాండా అధ్యక్షుడి సలహాదారుడు ఇసాక్ ఇన్సంగా, మరో ఇద్దరు ఏప్రిల్ 17న ముంబైకి వచ్చారు. తమ దేశంలో వీడియోకాన్ కంపెనీకి కేటాయించిన బొగ్గు గనుల వివాదంపై చర్చించేందుకు వచ్చారు. ఏమైందో ఏమో కానీ, వారిపై వీడియోకాన్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఉగాండా పౌరుల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకుని దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకున్నారు. చేసేది లేక న్యాయం కోసం వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వారి పిటిషన్ విచారించిన ధర్మాసనం పోలీసుల తీరుపై మండిపడింది.

ఇలాంటి చర్యలు దేశానికి చెడ్డపేరు తెస్తాయని వ్యాఖ్యానించింది. కొంతమంది పోలీసుల వైఖరి కారణంగా దేశానికి అప్రదిష్ట వస్తోందని పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదని పోలీసులకు అక్షింతలు వేసింది. వ్యాపార వివాదం కారణంగా వారి స్వేచ్ఛను అడ్డుకోరాదని సూచించింది. వెంటనే ఉగాండా పౌరులు స్వదేశం వెళ్లేందుకు వీలుగా పాస్ పోర్టులను తిరిగిచ్చేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News