: టాల్కం పౌడరుతో కేన్సర్ వస్తుందట
ఎక్కువగా టాల్కం పౌడర్‌ను ఉపయోగించే మహిళలకో హెచ్చరిక... మీరు ఎక్కువగా టాల్కం పౌడర్‌ను ఉపయోగిస్తే మీకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట. అందునా జననాంగాల వద్ద పౌడర్ వేసుకోవడం అంత మంచిది కాదని ఈమేరకు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో స్నానం చేసిన తర్వాత టాల్కం పౌడర్ వేసుకునే వారిలో మిగిలిన వారితో పోల్చితే అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 25 శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందట.
అమెరికాలోని బ్రిగమ్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్య పరిశోధకులు ఈ విషయంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. అండాశయ క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్న సుమారు 8,525 మంది మహిళల ఆరోగ్య పరమైన రికార్డులను వీరు ఈ సందర్భంగా పరిశీలించారు. రోజూ స్నానం చేసిన తర్వాత పౌడరు వేసుకునే మహిళల్లో అండాశయ క్యాన్సరు వచ్చే ప్రమాదం ఇతరులతో పోల్చితే ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలిందట. అందుకే మహిళలు ముఖ్యంగా జననాంగాల వద్ద పౌడరు వేసుకోవడం అంత మంచిది కాదని, దీనివల్ల పౌడరు రేణువులు శరీరంలోకి వెళ్లి మంట పుట్టిస్తాయని, తర్వాత కాలంలో ఇది క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.