: ఇక క్షయను నిర్మూలించవచ్చు
ఇప్పటి వరకూ క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే ఔషధాలు అంతగా లేవు. ఏదైనా ఒకమందు ఉంటే అది పూర్తిగా వ్యాధిని నిర్మూలించేందుకు సాధ్యం కాదు. దీంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఔషధాన్ని కనుగొనేందుకు పలు పరిశోధనలు చేశారు. చివరికి క్షయ కారక మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ (ఎంటీబీ)ని సమూలంగా నాశనం చేసే ఒక కొత్త మందును కనుగొన్నారు.
న్యూజెర్సీ మెడికల్ స్కూల్‌కు చెందిన డేవిడ్ అలాండ్ నేతృత్వంలో కొందరు శాస్త్రవేత్తల బృందం క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కొత్త మందు రూపకల్పనలో పలు పరిశోధనలు నిర్వహించారు. ఈ శాస్త్రవేత్తలు థియోఫేన్స్ అనే ఒక రసాయన మిశ్రమాన్ని ప్రయోగశాలలో తయారు చేసి, దీన్ని క్షయ కారక బ్యాక్టీరియాపై ప్రయోగించారు. ఈ మందు క్షయ బ్యాక్టీరియాను సమర్ధవంతంగా చంపుతున్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు దీన్ని ప్రస్తుతం క్షయ వ్యాధి చికిత్సలో వాడుతున్న ఐసోనియాజిడ్ అనే మందుతో కలిపి పరీక్షించారు. ఈ పరీక్షలో కొత్తమందు క్షయ కారక బ్యాక్టీరియాను సమూలంగా నిర్మూలించింది. రెండు పొడవైన కొవ్వు ఆమ్లాలను ఒక్కటిగా చేర్చుతూ, ఎంటీబీపై రక్షణ పొర ఏర్పడటానికి దోహదం చేస్తున్న పీకేఎస్‌ఎల్ 3 అనే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా ఈ మందు పనిచేస్తుంది. ఈ విషయం గురించి అధ్యయనానికి నేతృత్వం వహించిన డేవిడ్ అలాండ్ మాట్లాడుతూ ఎంటీబీ అనేది చిన్న సబ్బు బంతి లాంటిదని, దానికి పొడవైన ఆమ్లాలతో కూడిన పైపొర రక్షణ కవచంలా ఉపయోగపడుతోందని, ప్రస్తుతం ఈ ఆమ్ల పొరను ఛేదించే క్షయ మందులు అంతగా లేవని అన్నారు. కొత్తగా కనుగొన్న మందు గురించి ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఈ ఎంజైమ్ పూర్తి అణు స్వరూపాన్ని బాగా అర్ధం చేసుకోగలిగితే అప్పుడు మరింత సమర్ధవంతంగా, తక్కువ దుష్ప్రభావాలు చూపేలా మందును రూపొందించే అవకాశముందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.