: బరువు తగ్గితే.. మెమరీ పెరుగుతుందా?
వయస్సు పైబడేకొద్దీ మహిళల్లో జ్ఞాపకశక్తి సన్నగిల్లడం చూస్తుంటాం. అది క్రమేపీ కొందరిలో అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది కూడా. అయితే, బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు స్వీడన్ యూనివర్శిటీ పరిశోధకులు. క్యాలరీలను కరిగించడం ద్వారా బరువు తగ్గడం మాత్రమేకాదు, మెమరీ కూడా పెంచుకోవచ్చట. కొందరు మహిళలపై ప్రయోగాలు నిర్వహించగా.. డైటింగ్ ద్వారా వారు బరువు కోల్పోయినప్పుడు వారి మెదళ్ళలో జ్ఞాపకశక్తి కేంద్రాల్లో పలు మార్పులు జరిగినట్టు శాస్త్రజ్ఞులు గమనించారు.
ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఆండ్రియాస్ పీటర్సన్ మాట్లాడుతూ, ఒబేసిటీతో బాధపడుతున్న వారిలో మెమరీ తక్కువగా ఉండగా.. వారు బరువు తగ్గినపుడు ఆశ్చర్యకరంగా జ్ఞాపకశక్తి మెరుగైందని వివరించారు. ఈ ప్రయోగాల కోసం 20 మంది మెనోపాజ్ దశ దాటిన 61 ఏళ్ళు పైబడిన మహిళలను ఎంచుకున్నారు. వారిలో కొందరికి ఆరు మాసాలపాటు పేలియోలిథిక్ డైట్ అందించారు. అంటే, 30 శాతం ప్రొటీన్, 30 శాతం కార్బోహైడ్రేట్లు, 40 శాతం కొవ్వు ఉండే ఆహారం అందించారు. ఇక మరికొందరికి నార్డిక్ డైట్ ప్రకారం 15 శాతం ప్రొటీన్, 55 శాతం కార్బోహైడ్రేట్లు, 30 శాతం కొవ్వు ఉండే ఆహారం అందించారు.
బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) గణించి, వారు తగ్గిన బరువుకు వారిలో మెరుగైన మెమరీ పవర్ కు విలోమ సంబంధం ఉందని గుర్తించారు. అంటే, తక్కువ కెలోరీలున్న ఆహారం స్వీకరించి ఎక్కువ బరువు కోల్పోయిన మహిళల్లో జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగైందని పరిశోధకులు వెల్లడించారు.