: సనా ఖాన్ కు బెయిల్.. సల్మాన్ కు ఊరట
ఓ అమ్మాయి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ కు నేడు యాంటిసిపేటరీ బెయిల్ లభించింది. సనా సోదరుడు నవీద్ ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయిని అపహరించేందుకు యత్నించగా.. ఆ టీనేజ్ అమ్మాయి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేసిన వారిలో సనా కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, సనా అజ్ఞాతంలోకి వెళ్ళింది.
అయితే, సనా నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం 'మెంటల్' షూటింగ్ నిలిచిపోగా.. అందులో హీరోగా నటిస్తున్న సల్మాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఇక ఆ చిత్ర నిర్మాత అయితే దాదాపు రూ.10 కోట్ల నష్టం చవిచూశాడట. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రిందట సనా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నేడు విచారించిన ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకేముందీ, సల్మాన్ వెంటనే తన 'మెంటల్' షూటింగ్ ను పునఃప్రారంభించేశాడట.