: డబుల్ మీనింగ్ జోకులపై సిద్ధూ సిక్సర్
నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ.. 80, 90వ దశకాల్లో భారత క్రికెట్ జట్టులో దూకుడైన క్రికెట్ కు మారుపేరులా నిలిచిన ఓపెనర్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా ఈ సర్దార్జీది ఒకటే శైలి. తొలుత వారి బౌలింగ్ లయను దెబ్బతీసి.. ఆనక తనకనుగుణంగా బంతులు విసిరేలా తన ఆటతీరును కొనసాగిస్తాడు. ప్రపంచస్థాయి బ్యాట్స్ మెన్ కు కొరకరానికొయ్యలా పరిణమించిన లంక దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కు చుక్కలు చూపిన ఘనత సిద్ధూదే. క్రికెట్ నుంచి రిటైరైన పిమ్మట రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీ ప్రజాప్రతినిధిగా చక్రంతిప్పాడు. అంతేగాకుండా, తన వాక్చాతుర్యంతో క్రికెట్ వ్యాఖ్యాతగానూ రాణిస్తున్నాడు. అడపాదడపా టీవీ షోల్లో తళుక్కుమంటాడు.
తాజాగా, 'కామెడీ నైట్స్ విత్ కపిల్' అనే కామెడీ షోలో పాల్దొంటున్న సిద్ధూ డబుల్ మీనింగ్ జోకులపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తానెప్పుడూ ద్వందార్థాలతో సాగే జోకులకు వ్యతిరేకమన్నాడు. కామెడీ అంటే ప్రజలు నవ్వుకోవడానికి ఉద్దేశించిందని, వారికి ఎబ్బెట్టు కలిగించే కుళ్ళు జోకులను తాను ప్రోత్సహించనన్నాడు. ప్రఖ్యాత టీవీ హాస్య నటుడు కపిల్ శర్మ జతగా సిద్ధూ చేయబోతున్న ఈ కార్యక్రమం జూన్ 22 నుంచి 'కలర్స్' చానల్లో ప్రసారం కానుంది.