: బ్యాట్స్ మన్ గా వచ్చి బౌలర్ గా ఎదిగాడు!
రవీంద్ర జడేజా.. భారత క్రికెట్ కు లభించిన ఆణిముత్యమని కొందరు మాజీలు ఈపాటికే తేల్చేశారు. అతడి ప్రతిభాపాటవాలు అలాంటివి. ఒక్కోమెట్టు ఎక్కుతూ జాతీయ జట్టు తలుపుతట్టిన ఈ సౌరాష్ట్ర యువకెరటం ఇప్పుడు టీమిండియాలో స్టార్ క్రికెటర్. 2009లో తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన జడేజా.. గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ నాలుగేళ్ళలో అతని బ్యాటింగ్ టెక్నిక్, లెఫ్టార్మ్ స్పిన్ చాతుర్యం ఎంతో పదునుతేలాయి. తాజా గణాంకాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి.
చాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు తీశాడీ చలాకీ చిన్నోడు. స్పిన్ కు అనుకూలించని ఇంగ్లిష్ పిచ్ లపై ఈవిధంగా రాణించడం విశేషమే మరి. అందుకు ప్రతిఫలంగా.. జడేజా ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. అయితే, జడేజా బ్యాట్స్ మన్ గా జట్టులోకి వచ్చి బౌలర్ గా ఎదగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కెరీర్ తొలినాళ్ళలో బ్యాట్స్ మన్ గా జట్టులోకొచ్చిన ఈ 24 ఏళ్ళ గుజరాతీ.. ఇప్పుడు ఐదో బౌలర్ గా సేవలందిస్తున్నాడు. మున్ముందు జడేజా ఉన్నాడులే అని ధోనీ ముగ్గురు బౌలర్లతోనే బరిలో దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బంతి అప్పగించిన ప్రతిసారీ జడేజా కీలకమైన వికెట్లు తీస్తూ కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 47 పరుగులతో అజేయంగా నిలిచాడీ స్టయిల్ ఐకాన్.