: టిఫిన్ మానేస్తే... షుగరొస్తుందట!
ఉదయం పూట సమయం లేకపోవడం వల్లనో లేదా లావుగా ఉన్నాంకదా... టిఫిను తినడం మానేస్తే కాస్త తగ్గుతాంకదా... అనే ఉద్దేశ్యంతోనో మనవాళ్లు ముఖ్యంగా మహిళలు ఉదయం పూట అల్పాహారం తీసుకోరు. అయితే ఇలా తరచూ చేసే వారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కొలరాడో వర్సిటీకి చెందిన ఎలిజబెత్ ధామస్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ విషయంపై అధ్యయనం నిర్వహించింది. 29 ఏళ్ల వయసున్న తొమ్మిదిమంది వూబకాయాన్ని కలిగివున్న యువతులపై వీరు అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ విషయం గురించి ఎలిజబెత్ మాట్లాడుతూ ఒకరోజు ఉదయం అల్పాహారం తినకున్నా వారిలో ఇన్సులిన్, చక్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయని, కాబట్టి తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా అల్పాహారం తీసుకోని వారికి మధుమేహం వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.