: ఈ కంప్యూటర్ హ్యాకర్లను ఎదుర్కొంటుంది!
ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలను కలవరపెడుతోన్న సమస్య హ్యాకర్లు. ఈ సైబర్ దొంగలు కంప్యూటర్ వ్యవస్థపై దాడిచేసి అందులో నిక్షిప్తం చేసివున్న సమాచారాన్ని చోరీ చేయడం, లేదా పాడు చేయడం లాంటివి చేస్తున్నారు. పలు దేశాల రక్షణ వ్యవస్థలను ఈ హ్యాకర్లు నాశనం చేశారు. ఈ నేపధ్యంలో హ్యాకర్ల దాడికి దొరకకుండా ఉండేలా శక్తిమంతమైన కంప్యూటర్ వ్యవస్థను రూపొందించేందుకు ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆష్ట్రేలియా ప్రభుత్వ కంప్యూటర్లపై చైనా హ్యాకర్ల దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో హ్యాకర్లు చొరబడలేని సైబర్ భద్రతా వ్యవస్థలను తయారు చేయవలసిందిగా ఆష్ట్రేలియా ప్రభుత్వం శాస్త్రవేత్తలను కోరింది.
దీంతో శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహించి హ్యాకర్లను ఎదుర్కొనేందుకు వీలుగా, అత్యంత శక్తిమంతమైన హ్యాకర్ దుర్భేద్యమైన కంప్యూటింగ్ వ్యవస్థను రూపొందించారు. ఇందుకోసం ‘క్వాంటం క్రిప్టోగ్రఫీ’ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పరిజ్ఞానం హ్యాకర్లను పసిగట్టడమేకాకుండా... సమాచారాన్ని తస్కరించడానికి, లేదా నాశనం చేయడానికి వారు చేసే ప్రయత్నాలను తిప్పికొడుతుందటకూడా...!