: వ్యవస్థలో మార్పుతోనే అవినీతికి అంతం: అన్నా హజారే
దేశంలోని వ్యవస్థలో మార్పు వస్తేనే అవినీతిని అంతం చేయగలమని జనతంత్ర మోర్చా బహిరంగ సభలో సామాజిక కార్యకర్త, ఉద్యమ కారుడు అన్నా హజారే అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఆరుగురు అవినీతి మంత్రులున్నారని ఆయన ఆరోపించారు. పాతికేళ్ల కిందటే తన జీవితాన్ని ప్రజల సేవకి అంకితం చేశానని అన్నా హజారే తెలిపారు. ప్రజా సేవలో దొరికే సంతృప్తి మరెక్కడా పొందలేమని ఆయన అన్నారు.
అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం తేవాలని మహారాష్ట్రలో పదేళ్లు పోరాడామని అన్నా చెప్పారు. పన్నెండు రోజుల దీక్ష తర్వాతే సమాచార హక్కు చట్టం దస్త్రంపై రాష్ట్రపతి సంతకం చేశారని అన్నా వెల్లడించారు. తినడానికి తిండి, తాగేందుకు మంచినీరు లేని గ్రామాన్ని బాగుచేసి చూపానని ఆయన తెలిపారు. అలాగే దేశంలోని అన్ని గ్రామాల్లో మార్పు రావాలని, అప్పుడే దేశ ప్రగతిలో వికాసం కనిపిస్తుందని అన్నా సూచించారు.