: నక్సలైట్లకు బుల్లెట్లతోనే జవాబివ్వాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
భారత్ లోని మతతత్వ పార్టీలన్నింటికి పెద్ద దిక్కులాంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దేశ స్థితిగతులపై స్పందించింది. నక్సల్ సమస్యను చర్చల ద్వారా కంటే బుల్లెట్ల ద్వారానే పరిష్కరించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సలహా ఇచ్చారు. భగవత్ నేడు మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో మార్పు రావాలంటే హిందుత్వం ఒక్కటే మార్గమని ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుతం అవాస్తవాలను నమ్మే ధోరణి ప్రబలిపోయిందని, ఎవరుమెచ్చినా, మెచ్చకపోయినా.. హిందుత్వమే అన్ని రుగ్మతలను రూపుమాపుతుందని ఆయన పేర్కొన్నారు.
నేతలను, వారి అజెండాలను మార్చినా ఏమీ ఒరగదని.. రాజకీయాలు సైతం భారత్ ను సూపర్ పవర్ గా మార్చలేవని.. కేవలం హిందుత్వమొక్కటే అన్నింటికి పరిష్కారమని భగవత్ అన్నారు. ఇక పొరుగుదేశాలు పాకిస్తాన్, చైనాలపైనా ఆయన స్పందించారు. సరబ్ జిత్ ను పొట్టనబెట్టుకున్న పాక్ ఇంకా స్వేచ్ఛగా మనగలుగుతోందని.. సరిహద్దుల్లోకి చొరబడుతున్న చైనాకు గుణపాఠం నేర్పలేకపోయారని ఆయన కేంద్రాన్ని విమర్శించారు.