: మధుమేహ రోగులకు శుభవార్త.. ఏడాదికి ఒకే ఇంజక్షన్!
మధుమేహం నేటి కాలంలో చిన్నాపెద్దా తేడాలేకుండా అందర్నీ పట్టి పీడిస్తోన్న ప్రమాదకర వ్యాధి. యువతరాన్నీ ఇది ఎంతగానో కలవరపెడుతోంది. వ్యాధి లక్షణాలను బట్టి కొందరికి మాత్రలు, మరికొందరికి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ను ప్రతి రోజూ సిరంజి ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. అంటే, కొన్నాళ్ళకు శరీరం తూట్లు పడిపోతుందన్నమాట. ఎంత కష్టం. కానీ, తప్పదు. ఈ వ్యాధి కలిగించే ఉత్పాతాల ముందు ఇన్సులిన్ ఎక్కించుకోవడం శ్రమైనా భరిస్తారు రోగులు. అయితే, ఆ బాధలన్నింటికి చెక్ పెడతామంటున్నారు లండన్ ఇంపీరియల్ కాలేజీ నిపుణులు. ఇక ఏడాదికి ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే చాలని శుభవార్త చెబుతున్నారు.
వీరు హామర్ స్మిత్ ఆసుపత్రి పరిశోధకులతో కలిసి మూలకణాల ద్వారా మధుమేహాన్ని నియంత్రించగలిగే తరుణోపాయన్ని కనుగొన్నారు. రక్తంలోని స్టెమ్ సెల్స్ ను జన్యుమార్పిడి చేస్తే, అవి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా రూపాంతరం చెందుతాయి. తద్వారా ఆ కణాలు నిరంతరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయట. దీంతో, రోజూ ఇన్సులిన్ తీసుకోనవసరంలేదని పరిశోధకులు అంటున్నారు. ఏడాదికి ఒక్క ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తే.. అది సంబంధిత కణాలను క్రియాశీలకంగా మారుస్తుందని వారు వెల్లడించారు.