: ఆకాశంలో సగం... నాసాలో సగం...!
ఆకాశంలో సగం... అంటూ మహిళలు ఆక్రమిస్తున్న స్థానం గురించి వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఇప్పుడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఎంపికైన వ్యోమగాముల్లో కూడా సగం వారే ఆక్రమించారు. కొత్తగా ఎనిమిది మంది వ్యోమగాములను నాసా సోమవారం నాడు నియమించింది. వీరిలో నలుగురు అతివలే ఉండడం గమనార్హం.
ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోను మహిళలు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అంతరిక్ష యానంలో కూడా తాము భాగస్తులు కావాలని, అంతరిక్ష యాత్రల్లో తాము కూడా పాలుపంచుకోవాలని ఆలోచిస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయి. అయితే నాసాకు ఎంపికైన వ్యోమగాముల్లో సగం మంది మహిళలే ఉండడం ఇదే మొదటిసారి.
వీరికి ఏటా 64 వేల డాలర్ల నుండి 1.41 లక్షల డాలర్లను చెల్లిస్తారు. 2020 లలో గ్రహశకలంపైకి, 2030లో నాసా చేపట్టే అంగారక యాత్రలకు వీరిని సంసిద్ధం చేస్తున్నారు. ఈ కొత్తరకం వ్యోమగాములకు ఆసక్తికరమైన అంతరిక్ష యాత్రలకు ప్రణాళికలను రచించడంతోబాటు వాటిని నిర్వహించే అవకాశం దక్కుతుందని నాసా ఛీఫ్ చార్లెస్ బోల్డెన్ చెబుతున్నారు. ఈ వ్యోమగాముల ఎంపిక కోసం సుమారు 6100 దరఖాస్తులు రాగా, వారందరినుండి వీరిని ఎంపిక చేశారు.