: ప్రేమ లోతులను తాకి చూశానంటోన్న బాలీవుడ్ తార


ఆమె వయస్సు 27 ఏళ్ళే. అయితేనేం, బాలీవుడ్ చిత్రాల్లో ప్రేమ సన్నివేశాలకు ప్రాణం పోస్తుంది. ఇలాంటి అమ్మాయిని మన జీవితంలోకి ఆహ్వానించాల్సిందే అని ప్రేక్షకులతో అనిపిస్తుంది. ఆమె చిరునవ్వు.. ప్రభాతవేళల్లో వీచే పిల్ల తెమ్మెర మనస్సులను సుతారంగా నిమిరినట్టు ఉంటుంది. మరి ఓరకంట చూస్తేనో.. హృదయంలో రసవీణలు మోగుతాయి, ఇంపైన రాగాలు మనోఫలకం చుట్టూ చక్కర్లు కొడతాయి. ఆమె నటన అంత హృద్యంగా ఉంటుంది. ఆ అందాల తార పేరు సోనమ్ కపూర్. ఆమె నటించిన 'సావరియా', 'ఐ హేట్ లవ్ స్టోరీస్', 'ఢిల్లీ సిక్స్', 'మౌసమ్' చిత్రాలను చూసిన యువతకు ఇలాంటి ఫీలింగ్స్ కలగకపోతే ఆశ్చర్యపోవాలి, వారికి రసహృదయం లేదనుకోవాలి.

కానీ, సినిమాల్లో ప్రేమను పండించే ఈ సుమబాల నిజజీవితంలో మాత్రం ప్రేమను గెలిపించుకోలేకపోయిందట. గతంలో ఈమె 'ఐ హేట్ లవ్ స్టోరీస్' దర్శకుడు పునీత్ పండిట్ తోనూ, హీరో షాహిద్ కపూర్ తోనూ ప్రేమాయణం నడిపినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. తాను ప్రేమలో ఓడిపోయానని తెలిపింది. ఇప్పుడు తాను ఒంటరినే అని చెప్పింది.

ఏదేమైనా, మనుషులకు ప్రేమించే శక్తి అధికమని చెబుతోందీ చిన్నది. అంతేగాకుండా, ఎవరిలోనైనా ఎప్పుడైనా ప్రేమ అంకురిస్తుందని, ఎన్నిసార్లైనా ప్రేమలో పడే అవకాశాలున్నాయని, ఆ సామర్థ్యం మనుషులకు ఉంటుందని వివరించింది. కానీ, ఇంత చిన్న వయస్సులోనే భారీ ఫిలాసఫీ వెల్లడించడం చూస్తుంటే, సోనమ్, ప్రేమలో తీవ్రంగానే దెబ్బతిన్నట్టు అనిపించడంలేదూ.

  • Loading...

More Telugu News