: జంట సూర్యుళ్లు ఉండే గ్రహాల్లో జీవం ఉంటుందేమో...!
జంట సూర్యుళ్లు ఉండే గ్రహాల్లో జీవం ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో కనుగొన్నారు. ఇలా ఇద్దరు సూర్యుళ్లు ఉండే గ్రహాల్లో ఆవాసయోగ్యత ఎక్కువగా ఉంటుందని, ఇద్దరు సూర్యుళ్లు తమ కుటుంబంలోని గ్రహాలపైకి హానికారక సౌరగాలులు రాకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆ సూర్యుళ్ల కుటుంబంలో జీవం నివసించడానికి ఆవాసయోగ్యమైన 'గోల్డిలాక్స్ ప్రాంతం' విస్తృతి కూడా ఎక్కువగానే ఉంటుందని న్యూమెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతంలో ఇలా జంట సూర్యుళ్లు ఉండే సౌరవ్యవస్థలపై జరిగిన పరిశోధనలను మరింత విస్తృతం చేసి శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ద్వంద్వ తారలు తమను పరస్పరం నియంత్రించుకుంటాయని, ఒకదాన్ని ఒకటి నెమ్మదింపజేసుకుంటాయని, దాని ఫలితంగా వాటి చుట్టూ తిరిగే గ్రహాలకు అయస్కాతం రక్షణ పెరుగుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన జోనీ క్లార్క్ తెలిపారు. ఈ నక్షత్రాలు పది నుండి ముప్ఫై రోజులకు ఒకసారి పరస్పరం చుట్టివస్తే అప్పుడు ఆవాసయోగ్య ప్రాంతం యొక్క విస్తృతి మరింతగా పెరుగుతుందని ఆమె చెబుతున్నారు.