: ఆ మొక్కలతో క్యాన్సర్‌ను నిరోధించొచ్చు!
క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించేందుకు ఆఫ్రికాలోని ఒక మొక్క చక్కగా ఉపయోగపడుతోందట. తాజా అధ్యయనంలో ఆఫ్రికాలోని ఒక మొక్క మన శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిలువరిస్తున్నట్టు తేలింది. జాన్స్ గుటెన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం స్పష్టమయింది. ప్రస్తుతం ఈ మొక్కకు సంబంధించి పూర్తిస్థాయి పరిశోధనలను నిర్వహించడంలో శాస్త్రవేత్తలు నిమగ్నులై ఉన్నారు.
ఆఫ్రికాలో కనుగొన్న ఈ మొక్క క్యాన్సర్ కణాలను చంపడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తోందని, క్యాన్సర్ వ్యాధికి ఉపయోగించే ఔషధంకన్నా ఈ మొక్క మెరుగైన ఫలితాలనిస్తోందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ అండ్ బయోకెమిస్ట్రీకి చెందిన ప్రొఫెసర్ ధామస్ ఎఫెర్త్ అంటున్నారు. ఈ మొక్కలోని ఔషధ గుణాలపై మరిన్ని పరిశోధనలను చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిమోథెరపీ కన్నా మరింత మెరగైన ఔషధాలను తయారు చేసేందుకు వీలవుతుందని ఆయన అంటున్నారు. గత నాలుగేళ్లుగా ఎఫెర్త్ మరో శాస్త్రవేత్త డాక్టర్ విక్టర్ క్యూట్ ఆఫ్రికాలోని ఔషధగుణాలు కలిగిన పలురకాలైన మొక్కలపై పరిశోధనలు సాగిస్తున్నారు.