: పదిహడేళ్ళ సుదీర్ఘ మైత్రి అలా ముగిసింది!
బీజేపీ ప్రచార సారథిగా నరేంద్ర మోడీని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీతో సుదీర్ఘ బంధానికి జేడీయూ చరమగీతం పాడింది. అటు ఎన్డీఏ కన్వీనర్ పదవికి జేడీయూ అధినేత శరద్ యాదవ్ రాజీనామా చేయగా.. ఇటు బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ ప్రకటించారు. దీంతో, 17 ఏళ్ళ మైత్రి ముగిసినట్టయింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీహార్ రాజధాని పాట్నాలో నేడు శరద్ యాదవ్, నితీశ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
గోవా వేదికగా తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ తమను సంప్రదించకుండానే పని కానిచ్చేసిందని వారు ఆరోపించారు. పొత్తుకు పునాదులైన సిద్దాంతాలు వీగిపోవడంతోనే కటీఫ్ చెప్పామని వివరించారు. గోవా నిర్ణయంతో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీ సిద్ధంగా లేదని పరోక్షంగా మోడీ ఎంపికను ఎవరూ స్వాగతించడంలేదని చెప్పారు.
కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తమను అంతర్మథనంలోకి నెట్టాయని, అందుకే బీజేపీతో స్నేహాన్ని తెంచుకున్నామన్నారు. తమ పార్టీ అన్ని వర్గాలతో నిండి ఉందని, బీహార్ ప్రజల విశ్వాసం కోల్పోయేందుకు తాము సిద్ధంగాలేమని పేర్కొన్నారు. ఇక బలనిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్ ను కోరామని, తమ నిర్ణయం తప్పోఒప్పో ఈనెల 19న తేలుతుందని బీహార్ సీఎం నితీశ్ అన్నారు.