: మన ఫీల్డింగ్ శక్తికి తిరుగులేదు: ధోనీ


భారత జట్టు ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫీల్డింగ్ జట్టు అని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటున్నాడు. ఫీల్డింగ్ అంశంలో తమకు ఎదురేలేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చిరకాల ప్రత్యర్థి పాక్ తో పోరులో తమ ఆటగాళ్ళు అత్యద్భుత ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారని కొనియాడాడు. ప్రస్తుతం జట్టు మూడు విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందని ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిస్తామని తెలిపాడు.

బర్మింగ్ హామ్ లో పాక్ తో మ్యాచ్ సందర్భంగా వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించినా టీమిండియా స్ఫూర్తిని మాత్రం దెబ్బతీయలేకపోయాడు. తొలుత పాక్ ను 165 పరుగులకే కట్టడి చేసిన భారత్.. డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 102 పరుగుల విజయలక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నయా బ్యాటింగ్ సంచలనం శిఖర్ ధావన్ 48 పరుగులు చేసి టీమిండియా విక్టరీలో కీలకపాత్ర పోషించాడు.

కాగా, పాక్ పై విజయంతో భారత్ గ్రూప్-బిలో అగ్రస్థానం దక్కించుకుంది. మూడింటికి మూడు లీగ్ మ్యాచ్ లు గెలిచిన ధోనీ సేన ఈ నెల 20న కార్డిఫ్ లో జరిగే సెమీఫైనల్లో గ్రూప్-ఎలో రెండోస్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది.

  • Loading...

More Telugu News