: కృష్ణబిలాలకి ఎక్స్‌రే శక్తి ఎలా వచ్చిందంటే...
విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్). ఇవి అత్యధిక శక్తి కలిగిన ఎక్స్‌రేలను ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే ఈ ఎక్స్‌రేలను ఎలా ఉత్పత్తి చేస్తున్నాయి? అనేది శాస్త్రవేత్తలకు ఇంతకాలంగా ఒక అంతుపట్టని రహస్యంగా ఉండేది. అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చివరికి కృష్ణబిలాల ఎక్స్‌రే ఉత్పత్తి గురించిన రహస్యాన్ని తెలుసుకోగలిగారు. కృష్ణబిలంలోకి ఆకర్షితమయ్యే వాయువుల వల్లే అవి ఎక్స్‌రేలను ఉత్పత్తి చేస్తున్నట్టు ఈ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో నిర్ధారించారు.
కృష్ణబిలాలు అత్యధిక శక్తితో కూడిన ఎక్స్‌రేలను విడుదల చేస్తాయి. ఈ ఎక్స్‌రేలు వాయువులు కృష్ణబిలంలోకి ఆకర్షితం కావడం వల్లే వెలువడతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కృష్ణబిలం దిశగా అంతరిక్షంలోని వాయువులు ఒక క్రమపద్ధతిలో ఆకర్షితమవుతాయి. దీన్ని 'ఆక్రిషన్ వలయం' అని చెబుతారు. ఈ వాయువులు సుమారు కోటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కృష్ణబిలాన్ని వేడెక్కిస్తాయి. ఫలితంగా వలయంలోని ప్రధాన ఆకృతి ఉష్ణ్రోగ్రత, సూర్యుడికన్నా 2వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువ శక్తితో కూడిన ఎక్స్‌రేలను విడుదల చేస్తుంది. అయితే దాదాపు వంద రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసే శక్తిమంతమైన ఎక్స్‌రేలు కూడా ఈ కృష్ణబిలాలనుండి విడుదలవుతాయని తాజా పరిశోధనలో తేలింది. సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్, చేతిరాతతో కట్టిన సంప్రదాయ లెక్కలను ఉపయోగించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.