: గణితంతో కేన్సర్‌కు లింకు!
కేన్సర్ వ్యాధికి, గణితానికి లింకేంటా? అని ఆశ్చర్యంగా ఉంది కదూ... అయితే ప్రస్తుత కాలంలో కేన్సర్ మహమ్మారిపై పోరాడేందుకు వైద్య పరిశోధకులు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులోనిదే గణిత సూత్రాలను పయోగించడం! కేన్సర్ వ్యాధిపై పోరాటంలో వైద్య పరిశోధకులు ఆత్యాధునిక గణితశాస్త్ర సూత్రాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ కొత్త పద్ధతి ద్వారా ఆరోగ్యంగా ఉన్న కణాలకు హాని కలుగకుండా కేన్సర్ కణాలను మాత్రమే ధ్వంసం చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు.
ఒట్టావా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు డాక్టర్ బెల్ సారధ్యంలో ఆధునిక గణిత సూత్రాలను కేన్సర్ వైద్యంలో ప్రయోగించేలా ఒక కొత్త తరహా చికిత్సను అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారు ఆంకోలైటిక్ అనే వైరస్‌లను ఎంచుకున్నారు. నిజానికి ఈ వైరస్‌లకు కేన్సర్ కణాలపై సమర్ధవంతంగా దాడి చేయగల సామర్ధ్యం ఉంది. సాధారణ వైరస్లు సంక్రమించినపుడు కేన్సర్ కణాలు వాటిని అడ్డుకుంటాయి. అయితే ఆంకోలైటిక్ వైరస్లు ఈ అడ్డంకులను దాటుకొని కేన్సర్ కణాలను నాశనం చేయడమే లక్ష్యంగా వాటిపై దాడి చేస్తాయి. ఈ ఆంకోలైటిక్ కణాలను కచ్చితంగా ఉపయోగించుకోవడంలో భాగంగానే బెల్ నేతృత్వంలోని వైద్యశాస్త్రవేత్తల బృందం గణిత శాస్త్ర సూత్రాలను ఉపయోగించుకుంది.