: ఆర్మీ జవాన్లా.. అచ్చోసిన ఆంబోతులా?
దేశం కోసం ప్రాణాలర్పిస్తారని, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా.. జాతి రక్షణే ధ్యేయంగా కర్తవ్యోన్ముఖులై ఉంటారని మన దేశ సైనికుల గురించి వింటుంటాం. కానీ, కంచే చేను మేసినట్టు.. జాతి జనులను కాపాడాల్సిన జవాన్లే మాన భక్షకులైతే..! పరిస్థితి అత్యంత హేయంగా ఉంటుంది. అసోంలో జరిగిందిదే. ఓ టీనేజ్ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆనక కటకటాల వెనక్కి చేరారు. డిబ్రూఘర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ అన్నాచెల్లెలు కామాఖ్య ఎక్స్ ప్రెస్ దిగి అక్కడి రెస్ట్ రూముల్లో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. చెరో రూములోకెళ్ళి విశ్రాంతి తీసుకుంటుండగా.. ప్లాట్ ఫామ్ పై ఉన్న ఆర్మీ జవాన్లు (58 ఇంజినీర్స్ రెజిమెంట్) ఆ టీనేజ్ అమ్మాయి సోదరుడి రూముకు తాళం వేశారు. అనంతరం ఆ బాలిక ఉన్న రూములో ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నించడతో ఆమె గట్టిగా అరించింది.
అరుపులు విన్న కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆర్మీ జవాన్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు మొత్తం ఐదుగురు కాగా, వారిలో ఓ జవాను పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు అతన్నీ పట్టుకుని తెచ్చి పోలీసుల పరం చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆ కీచకులకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.