బిగ్‌బాస్ యావర్‌కు 'హనీ ట్రాప్' సెగ?.. రూ. 23 లక్షల కోసం బిల్డర్ మాస్టర్ ప్లాన్!

రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ ఒక భారీ మోసం బారిన పడ్డారు. గచ్చిబౌలికి చెందిన నవాజ్ అనే బిల్డర్ తనను ఆర్థికంగా, వ్యక్తిగతంగా దారుణంగా దెబ్బతీశారని యావర్ సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు అడిగితే తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


యావర్ వెల్లడించిన వివరాల ప్రకారం... బిల్డర్ నవాజ్ మొదట తన కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని యావర్‌ను నమ్మబలికాడు. ఆ సాన్నిహిత్యంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో యావర్ నుంచి రూ. 23 లక్షలు వసూలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మొత్తానికి బదులుగా రూ. 40 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. అయితే, సమయం గడిచాక యావర్ తన డబ్బులు తిరిగి అడగడంతో నవాజ్ అసలు రంగు బయటపడింది. డబ్బు ఇవ్వకపోగా, రివర్స్‌లో బెదిరింపులకు దిగడంతో యావర్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో నవాజ్ కొత్త ఎత్తుగడ వేశాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగా, తన కుమార్తెను పావుగా వాడుకుని 'హనీ ట్రాప్' ప్లాన్ చేశాడని యావర్ ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో యావర్‌పై తప్పుడు కేసు పెట్టించినట్లు తెలుస్తోంది. తన పరువు తీయడానికి, తనను భయపెట్టడానికి ఒక పద్ధతి ప్రకారం ట్రాప్ చేశారని యావర్ వాపోతున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన ఉన్నతాధికారులను, పోలీస్ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.



More Telugu News