: మహిళను ముంచిన దొంగ మెస్సేజ్
అభినందనలు
"మీరు మా నోకియా లాటరీలో రెండు కోట్లు గెలుచుకున్నారు. వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేసి బహుమానం సొంతం చేసుకోండి". ఇలాంటి ఎస్ఎంఎస్ లు మన ఫోన్లకు అదే పనిగా రావడం సర్వ సాధారణంగా మారిపోయింది. తెలిసిన వారైతే చూసిన వెంటనే డిలీట్ చేసి పారేస్తారు. కానీ, తెలియనివారు నిజమని నమ్మే ప్రమాదమూ లేకపోలేదు. సరిగ్గా ఇలా వచ్చిన ఎస్ఎంఎస్ తోనే పశ్చమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మహిళ నిండా మోసపోయింది.
లాటరీలో భారీగా నగదు బహుమతి లభించిందంటూ నాగవేణి మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ వచ్చింది. అంత సొమ్ము పంపడానికి ఖర్చులు, పన్నుల కోసం ముందు కొంత చెల్లించాల్సి ఉంటుందని విదేశీ మోసగాళ్లు చెప్పారు. నమ్మిన నాగవేణి వారు చెప్పినట్లుగా 7 లక్షల రూపాయలను బ్యాంక్ ద్వారా పంపించింది. చివరికి తాను నిలువునా మోసపోయానని ఆలస్యంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటీవలి కాలంలో విదేశీ కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. పలు మార్గాల ద్వారా మొబైల్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీలు సేకరించి.. లాటరీ గెలుచుకున్నారంటూ బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తారు. వాటిని నమ్మి సంప్రదిస్తే మాటలతో మాయ చేస్తారు. నిజమేనని నమ్మిస్తారు. పన్నులు, లాటరీ బహుమానం పంపడానికి అయ్యే వ్యయం పేరుతో డబ్బును రాబడతారు. ఇలాంటివి మీకూ వస్తే నమ్మకుండా పోలీసులకు సమాచారం అందించండి.