: ప్రేమికురాలి సజీవ దహనం
'నా కుమార్తె కోరుకుంటున్న వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిపించండి' అని అడిగిన పాపానికి ఆ తల్లిని గ్రామస్తులు చితక్కొట్టారు. ఆమె కూతుర్ని సజీవదహనం చేశారు. ఉత్తరప్రదేశ్ డోరియా జిల్లా కారకాల్ గ్రామంలో మంజు, రంజిత్ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను రంజిత్ పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా రంజిత్, మంజు తమ ప్రేమకే కట్టుబడి వున్నారు. దీంతో మంజు తల్లి పిల్లలిద్దరూ కోరుకుంటున్నట్టు వివాహం జరిపించాలంటూ పంచాయితీని ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన రంజిత్ తండ్రి జైహింద్ అతడి బంధువులతో కలిసి పంచాయితీలోనే హఠాత్తుగా మంజు తల్లిపై దాడికి దిగాడు. దీంతో నిర్ఘాంతపోయిన ప్రేమికురాలు తన తల్లిని రక్షించాలంటూ ఆర్తనాదాలు చేసింది.
సరిగ్గా అదను చూసిన జైహింద్ మద్దతుదారులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో మంజు సజీవదహనమైపోయింది. ఇందుకు బాధ్యులుగా పోలీసులు ఏడుగుర్ని గుర్తించి, వారిలో ఇద్దర్ని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.