: వయసుమీరిన వారికైనా యువతులే కావాలట!
పురుషుల్లో వయసు మీరిన వారైనా యవ్వనంలో ఉండే మహిళలతోనే జతకట్టడానికి మొగ్గు చూపుతారట. అందువల్లే మహిళల్లో మెనోపాజ్ దశ అనేది ఏర్పడిందట. ఈ విషయంపై ఏళ్లతరబడి అందరికీ ఒక సంశయం ఉండేది. భూమిపై జన్మించిన ఏ జీవజాతిలోనూ లేని లక్షణం కేవలం మనుషుల్లోని మహిళల్లోనే ఉండడం అనే దానికి కారణం కేవలం పురుషుల వివక్షతే తప్ప, ప్రకృతి సహజం కాదని భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త రామాసింగ్ చెబుతున్నారు. సాధారణంగా మహిళలు ఒక వయసు దాటిన తర్వాత వారిలో పునరుత్పత్తి సామర్ధ్యం అంతరించిపోతుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ అని ఇన్నాళ్లుగా మనం భావిస్తూ వచ్చాము. అయితే మహిళల్లో వచ్చే మెనోపాజ్‌కు కారణాలపై కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రామాసింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనంలో పురుషుల్లోని వివక్షతే మహిళల్లో మెనోపాజ్‌కు కారణమని తేలింది.
వయసు మీరిన పురుషులైనా యువతులతో జతకట్టడానికి ఉత్సాహం చూపడం వల్ల మధ్య వయసు మహిళలకు సంతానాన్ని కనే అవకాశం లేకుండా పోయిందని, ఇది కొన్ని వేల సంవత్సరాలపాటు కొనసాగడం వల్ల మహిళల్లో జన్యుమార్పులు జరిగి, మధ్య వయసుదాటిన మహిళల్లో పునరుత్పత్తి సామర్ధ్యం అంతరించడం జరిగిందని, దీని కారణంగా పలు శారీరక సమస్యలు తలెత్తటం సంభవించి ఉండవచ్చని రామాసింగ్ చెప్పారు. మెనోపాజ్ దశను గురించి వివరించడానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న గ్రాండ్‌మా థియరీని ఆయన కొట్టిపారేశారు. దీనికి పరిణామ శాస్త్రం ప్రకారం విలువలేదని, మనవలను, మనవరాళ్లను చూసుకోవడం కోసం తద్వారా మానవజాతి వారసత్వాన్ని కొనసాగించడం కోసమే మహిళల్లో ఒక వయసు దాటిన తర్వాత పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గి అడుగంటిపోతోందని ఈ గ్రాండ్‌మా థియరీ చెబుతోంది. దీన్ని రామాసింగ్ కొట్టిపారేశారు. అటు డార్విన్ ప్రకృతి పరిణామ సిద్ధాంతం ప్రకారం చూసినా కూడా మెనోపాజ్ అనేది సహజసిద్ధమైన ప్రక్రియ కాదని తేలుతోందని రామాసింగ్ తెలిపారు.
ఒక జీవజాతిని కొనసాగించే పునరుత్పత్తి లక్షణం జీవుల్లో మరణించే వరకూ ఉంటుందని, అయితే మనుషుల్లో మాత్రం ఇది పురుషులకు తప్ప మహిళలకు ఉండకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. వయసుమీరిన మహిళల పట్ల పురుషులు వివక్ష చూపకుండా ఉండివుంటే, పురుషులలాగే మహిళలు కూడా జీవితాంతం పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉండేవారని రామాసింగ్ చెప్పారు. చారిత్రకంగా యవ్వనంలో ఉండే పురుషులను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం మహిళలకు ఉండివుంటే గనుక అప్పుడు మెనోపాజ్ దశ పురుషుల్లో ఉండేదని, అప్పుడు పురుషులు ఒక వయసు దాటిన తర్వాత పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోయి ఉండేవారని రామాసింగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.