: తేలికైన విమానం ఇంధన ఖర్చు తక్కువే
ఈ కొత్తరకం విమానం తేలికైనది, దీనికి ఉపయోగించే ఇంధనం కూడా తక్కువే. ఎయిర్‌బస్ సంస్థ ఈ కొత్తరకం విమానాన్ని రూపొందించింది. దీనికి ఏ350 అనే పేరుపెట్టింది. ఈ కొత్త విమానాన్ని శుక్రవారం నాడు గగనంలో విహారం చేయించింది. సుదీర్ఘకాలం పాటు గగన విహారం చేసే విమానశ్రేణి మార్కెట్లో బోయింగ్ సంస్థకు చెందిన 787 డ్రీమ్‌లైనర్‌కు పోటీగా ఎయిర్‌బస్ సంస్థ దీన్ని రూపొందించింది.
ఈ కొత్త రకం విమానంలో సగంకన్నా ఎక్కువ భాగాన్ని తేలికపాటి మిశ్రమ పదార్థాలతో రూపొందించారు. దీనివల్ల ఇంధన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లోని టౌలోజ్ నగరంలోని విమానాశ్రయం నుండి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇది నాలుగు గంటల పాటు గగనంలో విహరించింది. మొత్తం 18 నెలల పాటు ఈ విమానాన్ని గగనంలో విహారం చేయించిన తరువాత ఈ తరహా విమానాల ఉత్పత్తిని చేపడతారు. ఈ కొత్త విమానాలకొరకు ఇప్పటికే ఖతార్ ఎయిర్‌వేస్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ తదితర సంస్థలు ఆర్డర్లు పెట్టాయి.