: రోదసిపై మహిళా విజయానికి యాభైయ్యేళ్లు
రోదసిలోకి మహిళలు అడుగుపెట్టి యాభైయ్యేళ్లు పూర్తయింది. 1963 జూన్ 16న రష్యా మహిళా వ్యోమగామి వాలెంటినా తెరెష్కోవా తొలిసారిగా రోదసిలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఘటన జరిగి యాభైయ్యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ స్వర్ణోత్సవాల్లో ఐక్యరాజ్యసమితి మహిళాశక్తిని ప్రశంసించింది. వాలెంటినా తెరెష్కోవా రోదసి యాత్ర తరువాత కెనడా, చైనా, అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన సుమారు 60 మంది మహిళలు రోదసిలోకి ప్రయాణం చేశారు.
ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ రోదసిలోకి ప్రయాణం చేసిన ఈ మహిళలంతా వనితా లోకానికి స్ఫూర్తిదాతలని ఐరాసకు చెందిన రోదసి వ్యవహారాల కార్యాలయ సంచాలకులు మజ్లాన్ ఓథ్మన్ అన్నారు. 1984లో స్వెత్లానా సవిత్సయా తొలిసారిగా అంతరిక్షంలో నడిచి 30 ఏళ్లయిందని, తర్వాత సునీతా విలియమ్స్ సాధించిన విజయం మహిళా శక్తికి నిదర్శనమని ఓథ్మన్ అన్నారు. ఈ సందర్భంగా వాలెంటినా తెరెష్కోవా మాట్లాడుతూ అంతరిక్ష కార్యక్రమాల్లో మరింతగా మహిళలు పాల్గొనాలనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు.