: మనలాగే బొమ్మకూ ఉందో పాస్‌పోర్ట్!
మనుషులకు పాస్‌పోర్టు ఉండడం సహజం. అయితే బొమ్మకు పాస్‌పోర్ట్ ఏంటా... అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కానీ ఇది నిజమే. అయితే, అన్ని బొమ్మలకు కాదుగానీ... లండన్‌లోని ఎమిలీ ఆడుకునే అందమైన బొమ్మకు మాత్రం పాస్‌పోర్టు ఉంది. అది కూడా చక్కటి టర్కీ అధికారిక ముద్ర ఉన్న పాస్‌పోర్టు. తొమ్మిదేళ్ల ఎమిలీ హారిస్ వాళ్ల కుటుంబం ఒక వారం రోజుల పాటు టర్కీకి విహారయాత్రకు వెళ్లాలనుకున్నారు. దీంతో ముగ్గురికీ పాస్‌పోర్టులు తీశారు. అయితే ఎమిలీ తన బొమ్మకు కూడా పాస్‌పోర్టు కావాలికదా అనుకుంది. ఈ విషయాన్నే అమ్మతో చెప్పింది. నా యూనికార్స్ బొమ్మకూ పాస్‌పోర్టు కావాలిగదా...? అని ప్రశ్నించింది. అయితే వెంటనే ఎమిలీ అమ్మ సదరు బొమ్మకు కూడా ఉత్తుత్తి పాస్‌పోర్టు తయారు చేసి ఇచ్చింది. దీంతో ఎమిలీ హ్యాపీ. అయితే తర్వాతనే అసలు విషయం జరిగింది.
ఎమిలీ వాళ్ల కుటుంబం టర్కీలోని అంతాల్యా విమానాశ్రయంలో దిగారు. అధికారులకు పాస్‌పోర్టులు చూపించారు. ఈ సమయంలో ఎమిలీ అమ్మగారు చిన్న పొరబాటు చేశారు. కుమార్తె పాస్‌పోర్టుకు బదులుగా బొమ్మకోసం తాము తయారు చేసిన 'బొమ్మ పాస్‌పోర్ట్'ను చూపించేశారు. అటు అధికారులు కూడా సహజంగానే గమనించకుండా బొమ్మ పాస్‌పోర్టుపైన తమ అధికారిక ముద్రను వేసేశారు. దీంతో సదరు టెడ్డీబేర్ బొమ్మకు అధికారిక పాస్‌పోర్టు వచ్చేసింది. పాస్‌పోర్టుపైన ఎమిలీ బొమ్మకు బదులుగా టెడ్డీబేర్ బొమ్మ ఉండడాన్ని అధికారులు గమనించకపోవడంతో బొమ్మగారికి పాస్‌పోర్టు వచ్చేసింది. ఇదంతా వినేందుకు తమాషాగా అనిపించినా... ఎమిలీ తల్లి నిక్కీ మాత్రం చాలా బాధ్యతాయుతంగా బాధపడుతోంది. వినేందుకు ఇదంతా తమాషాగా అనిపించినా... ఇది చాలా ఆందోళన చెందాల్సిన విషయమని, రేపు ఇంకెవరైనా ఇలాగే నకిలీ పాస్‌పోర్టులతో పిల్లల్ని తీసుకెళ్లినా ఇలాగే అధికారులు పట్టించుకోరేమో అని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.