: ఈ షార్టుతో సెల్ ఛార్జ్ చేసుకోవచ్చట!
ఆధునిక యువత ఎక్కువగా ఉపయోగించే దుస్తుల్లో షార్ట్స్ ఒకటి. అయితే ఇప్పుడు ఈ షార్ట్స్‌లో కూడా సాంకేతికతను చొప్పించి, మన అవసరాలకు అనుగుణంగా రూపొందించేలా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంగ్లాండులోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం షార్ట్స్‌ను తయారు చేశారు. ఈ షార్ట్స్‌తో మన సెల్‌ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చట. అంతేకాదు... వీరే ఒక కొత్త రకం పరుపును కూడా తయారు చేశారు. ఈ పరుపుపై మనం సేదదీరడమే కాదు... చక్కగా మన ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చుకూడా.
మనం వేసుకునే షార్ట్స్‌కు వాడే బట్టలో చాలా పొరలుంటాయి. ఆ పొరల మధ్య ఖాళీలుంటాయి. ఆ షార్ట్స్‌ను మనం వేసుకుని నడిచేటప్పుడు ఆ ఖాళీల మధ్య ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడితో ఉత్పత్తయ్యే శక్తిని మొబైల్‌కి అవసరమైన చార్జ్‌గా మార్చేసుకుంటుంది. ఇదంతా చేయాలంటే మనం మొబైల్‌ని మన షార్ట్స్ జేబులో పెట్టుకుని మామూలుగా నడిస్తే చాలు. ఇక పరుపుపై మనం నిద్రపోతే చాలు. పరుపుపై మనం నిద్రపోయేటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత శక్తిని పరుపు గ్రహించి, దాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చేసుకుంటుంది. మనం ఓ ఎనిమిది గంటలపాటు పరుపుపై నిద్రపోతే చాలు... ఇక రోజంతా మనం ఫోన్‌ను ఛార్జింగ్ చేయాల్సిన పనిలేదు. ఈ కొత్తరకం పరుపు, షార్ట్స్‌ను సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వొడాఫోన్ సంస్థ సహకారంతో రూపొందించారు. వీటిని ఈ వారాంతంలోనే వినియోగానికి తీసుకురానున్నారు. లండన్‌లో జరిగే 'ఐల్ ఆఫ్ వెయిట్' వేడుకలకు వెళ్లే యువతకు వీటిని అందిస్తున్నారట.