తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్

  • తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌ 
  • ఈ నెల 28,29 తేదీలలో ఇద్దరు భక్తుల నుంచి నగదు, విలువైన వస్తువులు చోరి చేసిన వైనం
  • బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన టూటౌన్ పోలీసులు
తిరుమలలో భక్తులను మాటలతో బురిడి కొట్టించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శ్రీరాముడు తెలిపిన సమాచారం మేరకు..తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, హనుమకొండ జిల్లాకు చెందిన  మండ నవీన్‌ కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. 

ఈ నెల 28న కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను పీఏసీ -5 వద్ద పరిచయం చేసుకున్న నిందితులు, మరుసటి రోజు అంటే 29న తెలంగాణకు చెందిన మరో భక్తుడితో కల్యాణకట్ట షెడ్ల పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసుకున్నారు. భక్తుల నమ్మకాన్ని పొందిన అనంతరం వారి లగేజీ బ్యాగులను మాయమాటలతో స్వాధీనం చేసుకుని అందులోని నగదు, విలువైన వస్తువులను చోరీ చేశారు. 

ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాంభగీచా కార్‌ పార్కింగ్‌ వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ.45వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


More Telugu News