టైమ్స్ ర్యాంకింగ్స్ నుంచి బిట్స్ పిలానీ వాకౌట్.. ఐఐటీల బాటలో కీలక నిర్ణయం

  • టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ నుంచి తప్పుకున్న బిట్స్ పిలానీ
  • మూల్యాంకన విధానంలో పారదర్శకత లోపించిందన్న సంస్థ
  • 2020లో ఇదే కారణంతో వైదొలిగిన పలు ప్రముఖ ఐఐటీలు
  • ర్యాంకింగ్ విధానాలు మెరుగుపడితే మళ్లీ పాల్గొంటామని వెల్లడి
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (బిట్స్ పిలానీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ర్యాంకింగ్స్ కోసం అనుసరిస్తున్న మూల్యాంకన విధానంలో పారదర్శకత, కచ్చితత్వం లోపించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది.

సంస్థాగతంగా పూర్తిస్థాయి సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిట్స్ పిలానీ యాజమాన్యం వెల్లడించింది. ర్యాంకింగ్ విధానంలో ఉపయోగిస్తున్న "ఒపేక్, బ్లాక్ బాక్స్ రెప్యుటేషన్ స్కోర్స్" వంటి పద్ధతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయాల పనితీరును అంచనా వేసే విధానాలు విశ్వసనీయంగా, జవాబుదారీతనంతో ఉండాలని పేర్కొంది.  "ఈ ర్యాంకింగ్ సైకిల్ నుంచి సంస్థాగత, సబ్జెక్టుల వారీ డేటాను THEకి అందించడం నిలిపివేస్తున్నాం. ఫలితంగా, ఇకపై రాబోయే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్, ఆసియా, సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో బిట్స్ పిలానీ కనిపించదు" అని ఓ ప్రకటనలో తెలిపింది.

గతంలో ఇదే తరహా కారణాలతో పలు ఐఐటీలు కూడా THE ర్యాంకింగ్స్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2020లో ఐఐటీ బాంబే, ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ సహా ఏడు ప్రముఖ ఐఐటీలు ఈ ర్యాంకింగ్స్ నుంచి వైదొలిగాయి. ఇప్పుడు వాటి బాటలోనే బిట్స్ పిలానీ నడిచింది. అయితే, భవిష్యత్తులో ర్యాంకింగ్ విధానంలో పారదర్శకత, స్థిరత్వం, విశ్వసనీయత పెరిగితే మళ్లీ ఈ ప్రక్రియలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ పేర్కొంది.


More Telugu News