ఇది విచారణ కాదు... ప్రతీకారం: కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఫైర్

  • కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపేనన్న కేటీఆర్
  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ చర్యలని ఆరోపణ
  • చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని వ్యాఖ్య
  • బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరపలేరని హెచ్చరిక
  • కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది విచారణ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అని ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్, పాలనా లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ నోటీసులు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. "చావు నోట్లో తలపెట్టి, సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని దీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. తన పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి నాయకుడిపై అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విచారణల పేరుతో వేధించడం దుర్మార్గం" అని ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, కేవలం నోటీసులు ఇచ్చి, బెదిరింపులకు పాల్పడి తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆయన కీర్తిని చెరిపేయలేరని హెచ్చరించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదని, ప్రజలే సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ అన్యాయ పాలనపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. చరిత్రను విచారణలతో కాదని, ప్రజల తీర్పుతోనే రాస్తారని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News