పద్మశ్రీ పురస్కారం రావడంపై మురళీమోహన్ స్పందన

  • సినీ రంగంపై ఐదు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మురళీమోహన్
  • ఎంపీగా రాజకీయాల్లో సైతం రాణించిన సీనియర్ యాక్టర్
  • తనకు పద్మశ్రీ రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మురళీమోహన్

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఇండస్ట్రీలో కొనసాగుతూనే రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ... ఆయనకు నిరాశే మిగిలింది.. చివరకు 2026కి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఆయనకు పద్మశ్రీ దక్కింది. 


తనకు పద్మ పురస్కారం దక్కడంపై మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని వారికి చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబుకి, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతాను. థ్యాంక్యూ" అని అన్నారు.


1940 జూన్ 24న మద్రాస్ ప్రెసిడెన్సీలోని చాటపర్రులో జన్మించిన మురళీమోహన్, స్వాతంత్ర్య సమరయోధుడు మాగంటి మాధవరావు కుమారుడు. ఏలూరులో చదువుకున్న ఆయన, 1973లో 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. 1974లో 'తిరుపతి' చిత్రంతో ప్రసిద్ధి చెందిన మురళీమోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా సహాయ నటుడిగా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.


నిర్మాతగా కూడా మురళీమోహన్ ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. 1980లో తన సోదరుడు కిశోర్‌తో కలిసి స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై 25కి పైగా సినిమాలు నిర్మించారు. వీటిలో 'అతడు' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ఆయన నిర్మాతగా మూడు నంది అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కీలక పదవులు నిర్వహించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా సేవలందించారు.


సినిమా రంగం దాటి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మురళీమోహన్, టీడీపీ తరఫున 2009లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే, 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి, 16వ లోక్‌సభలో అడుగుపెట్టారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్య, వైద్య రంగాల్లో సామాజిక సేవలు చేపట్టారు.


మాగంటి మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించారు. ఈ ట్రస్ట్ ద్వారా దాదాపు 10 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.



More Telugu News