రజనీ-కమల్ సినిమాపై మౌనం వీడిన లోకేశ్.. అసలు కారణం ఇదే!

  • రజనీకాంత్-కమల్ హాసన్ సినిమాపై వస్తున్న విమర్శలకు లోకేశ్ కనగరాజ్ స్పష్టత
  • వారిద్దరి కోసం ఒకటిన్నర నెలలు కష్టపడి యాక్షన్ కథ సిద్ధం చేశానన్న దర్శకుడు
  • వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నందున తేలికపాటి సినిమా చేయాలనుకున్నారని వెల్లడి
  • లైట్ హార్టెడ్ సినిమాలు తీయడం తనకు చేతకాదని, అందుకే ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానని స్పష్టీకరణ
తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోయే భారీ చిత్రం నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంపై తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

"కూలీ సినిమా సమయంలో నేను రజనీకాంత్, కమల్ హాసన్ సార్లను కలిశాను. ఇద్దరూ కలిసి సినిమా చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. 46 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావించాను. ఆ సమయంలో 'ఖైదీ 2' కమిట్‌మెంట్ ఉన్నప్పటికీ, ఈ అరుదైన అవకాశం మళ్లీ రాదేమోనని భావించి ముందుగా ఈ సినిమాను పూర్తి చేయాలనుకున్నాను" అని లోకేశ్ వివరించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఒకటిన్నర నెలల పాటు ఎంతో శ్రద్ధగా స్క్రిప్ట్ రాశానని, ఇద్దరు స్టార్ల ఇమేజ్‌కు సరిపోయేలా ఉత్తమమైన కథను సిద్ధం చేశానని తెలిపారు. ఆ తర్వాత ఇద్దరినీ వేర్వేరుగా కలిసి కథ వినిపించిన‌ట్లు చెప్పారు.

అయితే, రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. "'జైలర్ 2' వరకు రజనీ సర్ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. అటు కమల్ సర్ కూడా స్టంట్ మాస్టర్ అన్బరివు దర్శకత్వంలో హెవీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. దీంతో మళ్లీ యాక్షన్ సినిమానే చేయడం అవసరమా? అని వారు భావించారు. ఒక తేలికపాటి (లైట్ హార్టెడ్) సినిమా చేయాలనే ఆలోచనలో వారు ఉన్నారని నాకు అర్థమైంది. కానీ, నేను అలాంటి లైట్ హార్టెడ్ చిత్రాలు తీయలేను. ఈ విషయాన్ని నిజాయతీగా వారితో చెప్పి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను" అని లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తన 'కూలీ' సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో విమర్శలు వచ్చినా సినిమా 35 రోజులు ఆడిందని, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని సన్ పిక్చర్స్ చెప్పిందని పేర్కొన్నారు. ఈ అనుభవం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, వాటిని భవిష్యత్ చిత్రాలలో అమలు చేస్తానని తెలిపారు.


More Telugu News