ప్రాణాలకు తెగించి 101 అంతస్తుల భవనాన్ని ఎక్కేశాడు.. తైవాన్‌లో అమెరికా సాహసికుడి రికార్డ్

  • తాడు, సేఫ్టీ బెల్ట్ లేకుండా 508 మీటర్ల ఎత్తున్న 'తైపీ 101' భవనాన్ని ఎక్కిన అలెక్స్ హానోల్డ్
  • గంటా 31 నిమిషాల్లోనే 101 అంతస్తుల భవనాన్ని అధిరోహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైనం
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సాహసాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన లక్షలాది మంది నెటిజన్లు
  • ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచిన అలెక్స్‌
  • స్వయంగా అభినందించిన తైవాన్ అధ్యక్షుడు
సాధారణంగా ఎవరైనా 101 అంతస్తుల భవనం పైకి వెళ్లాలంటే లిఫ్ట్ కోసం వెతుకుతారు. కానీ, అమెరికాకు చెందిన 40 ఏళ్ల సాహసికుడు అలెక్స్ హానోల్డ్ మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, కేవలం తన చేతులు, కాళ్ల సాయంతో ఆకాశమంత ఎత్తున్న 'తైపీ 101' భవనాన్ని ఎక్కేశాడు. ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా ఆయన చేసిన ఈ 'ఫ్రీ సోలో' క్లైంబింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

శనివారం వర్షం కారణంగా వాయిదా పడిన ఈ సాహసం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. భవనం మూలల్లో ఉండే చిన్నపాటి అంచులు, ఎల్‌-షేప్ ఆకృతులను ఆధారంగా చేసుకుని అలెక్స్ పైకి పాకాడు. కింద వేల సంఖ్యలో వున్న జనం కేరింతలు కొడుతూ ఆయన్ని ఉత్సాహపరిచారు. 89వ అంతస్తులోని అద్దాల మేడ గుండా ఆయన వెళ్తున్నప్పుడు లోపల ఉన్న పర్యాటకులు షాక్‌తో ఆయన్ని చూస్తూ ఉండిపోయారు.

గతంలో 'ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్' అలైన్ రాబర్ట్ ఈ భవనాన్ని ఎక్కినప్పటికీ, ఆయన తాడు సాయం తీసుకున్నారు. కానీ అలెక్స్ మాత్రం ఎటువంటి సాయం లేకుండా కేవలం 91 నిమిషాల్లోనే శిఖరాగ్రానికి చేరుకుని 'సిక్' (అద్భుతం) అని వ్యాఖ్యానించారు. శిఖరాగ్రం వద్ద గాలి వేగంగా వీస్తున్నా ఏమాత్రం బెదరకుండా సెల్ఫీ తీసుకుని తన పట్టును చాటుకున్నాడు.

ఈ సాహసం ముగిసిన వెంటనే అలెక్స్ భార్య సాన్నీ మెక్‌కాండ్‌లెస్ అతనిని ఆలింగనం చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్-టే ఫేస్‌బుక్ వేదికగా అలెక్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. "నీ సాహసం చూస్తుంటే గుండె ఆగినంత పనైంది, తైవాన్ అందాలను ప్రపంచానికి చూపినందుకు ధన్యవాదాలు" అని కొనియాడారు. ప్రస్తుతం ఈ క్లైంబింగ్ వీడియో నెట్టింట మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. 


More Telugu News