భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు... బీసీబీ వినతిని తిరస్కరించిన ఐసీసీ

  • ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ వినతి తిరస్కరణ
  • భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్వతంత్ర నివేదికలు స్పష్టం చేశాయన్న ఐసీసీ
  • ఐపీఎల్ వివాదానికి, ప్రపంచకప్‌కు సంబంధం లేదని తేల్చిచెప్పిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
  • షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా, ముంబైలలోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడి
  • టోర్నీ నుంచి తప్పుకుంటే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం
టీ20 ప్రపంచకప్‌-2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్‌లోనే ఆడాల్సి ఉంటుందని బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు సభ్యుల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుది నిర్ణయం తీసుకున్నారు.

భారత్‌తో తమ క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయని, ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి తమ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించడమే ఇందుకు కారణమని బంగ్లా బోర్డు ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బీసీబీ కోరింది.

అయితే, బీసీబీ వినతిని ఐసీసీ తోసిపుచ్చింది. భారత్‌లోని టోర్నమెంట్ వేదికల వద్ద బంగ్లాదేశ్ ఆటగాళ్లకు, అధికారులకు లేదా అభిమానులకు ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని స్వతంత్ర సమీక్షలతో సహా అన్ని నివేదికలు స్పష్టం చేశాయని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక దేశీయ లీగ్‌లో ఆటగాడికి సంబంధించిన వివాదానికి, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌కు ముడిపెట్టడం సరికాదని ఐసీసీ హితవు పలికింది. టోర్నమెంట్‌కు అంతా సిద్ధమవుతున్న షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదని, సరైన భద్రతా కారణం లేకుండా వేదికలను మారిస్తే భవిష్యత్తు ఐసీసీ ఈవెంట్ల నిష్పాక్షికతకు ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించింది.

షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ (ఫిబ్రవరి 7), ఇటలీ (ఫిబ్రవరి 9), ఇంగ్లండ్‌ (ఫిబ్రవరి 14)తో ఆడనుంది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో (ఫిబ్రవరి 17) తలపడనుంది. ఒకవేళ ఈ మెగా ఈవెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే, వారి స్థానంలో టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.


More Telugu News