బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్!

  • యూకేలో పాకిస్థానీ గ్యాంగుల ఆగడాలు
  • మైనారిటీ సిక్కు, హిందూ అమ్మాయిలే ప్రధాన లక్ష్యం
  • లండన్‌లో 15 ఏళ్ల సిక్కు బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం
  • పోలీసుల తీరుపై సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహం, ఆందోళన
  • గతంలోనూ రోథర్‌హామ్‌లో 1400 మంది చిన్నారులపై లైంగిక దాడులు
యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లో పాకిస్థానీ మూలాలున్న వ్యక్తులు నడుపుతున్న గ్యాంగుల ఆగడాలు మరోసారి తీవ్ర కలకలం సృష్టించాయి. తాజాగా పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లో ప్రాంతంలో 15 ఏళ్ల సిక్కు బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా వ్యవస్థీకృతంగా చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఈ ముఠాల నేరాలకు ఈ ఘటన అద్దం పడుతోంది.

'ది సండే గార్డియన్' తన కథనంలో ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, పాకిస్థానీ మూలాలున్న ఆరుగురు సభ్యుల ముఠా సదరు బాలికను కిడ్నాప్ చేసి, ఓ ఫ్లాట్‌లో నిర్బంధించింది. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఆగ్రహించిన సుమారు 300 మంది సిక్కులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగి, పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసుల తీరుపై అసంతృప్తితో ఉన్న సిక్కు సమాజం ప్రతినిధులే స్వయంగా రంగంలోకి దిగి ఆ బాలికను రక్షించడం గమనార్హం.

సాధారణంగా ఈ ముఠాలు 11 నుంచి 16 ఏళ్ల వయసున్న బలహీన వర్గాల అమ్మాయిలను, ముఖ్యంగా సిక్కు, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటాయి. ప్రేమ, స్నేహం, బహుమతుల పేరుతో వారిని లోబరుచుకుని, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దోపిడీకి పాల్పడతాయి. గతంలో రోథర్‌హామ్, రోచ్‌డేల్ వంటి పట్టణాల్లో ఇలాంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. 

2014 అలెక్సిస్ జే నివేదిక ప్రకారం, ఒక్క రోథర్‌హామ్‌లోనే 1997-2013 మధ్య కనీసం 1,400 మంది చిన్నారులు లైంగిక దోపిడీకి గురయ్యారు. నిందితుల్లో అత్యధికులు పాకిస్థానీ మూలాల వారేనని నివేదిక తేల్చింది. జాతి వివక్ష ఆరోపణలు వస్తాయనే భయంతో అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని, ఇదే ఈ ముఠాల ఆగడాలకు కారణమని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.


More Telugu News