నా భుజంపై చేయి వేసి రాహుల్ గాంధీ గెలిపించమంటే ప్రజలు నన్ను ఓడించారు: జగ్గారెడ్డి

  • జీవితంలో తాను సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనన్న జగ్గారెడ్డి
  • రాహుల్ గాంధీని ఇక్కడకు పిలిచి అవమానించినట్లుగా భావిస్తున్నానని వ్యాఖ్య
  • తన జీవితంలో ఇది మరిచిపోలేని విషయమన్న జగ్గారెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన భుజంపై చేయి వేసి తనను గెలిపించాలని ఇక్కడి ప్రజలను కోరితే, వారు ఓడించారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇక తాను జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ళ స్థలం లేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ఇక్కడకు పిలిచి తాను అవమానించినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి గెలిపించాలని ప్రచారం చేశారని, కానీ ఫలితం మాత్రం తనకు అనుకూలంగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన జీవితంలో ఇది మరిచిపోలేని విషయమని ఆయన అన్నారు. తన ఓటమికి ఇక్కడి పేద ప్రజలు కాదని, మేధావులు, పెద్దలని విమర్శించారు. సంగారెడ్డిలో ఈసారి తన భార్య నిర్మల పోటీ చేసినా తాను ప్రచారానికి కూడా రానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానని, సంగారెడ్డిలో మాత్రం చేయబోనని అన్నారు.


More Telugu News