ఇన్‌ఫ్లుయెన్సర్ల 'లక్కీ డ్రా' ప్రకటనలు.. హెచ్చరించిన సజ్జనార్

  • లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త ఉండాలని ప్రజలకు సూచన
  • బెట్టింగ్ యాప్‌ల దందా ఆగిపోవడంతో లక్కీ డ్రా అంటూ వేషాలు వేస్తున్నారని ఆగ్రహం
  • చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించిన సజ్జనార్
సామాజిక మాధ్యమాల్లో లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. "రీల్స్‌లో బిల్డప్... రియాల్టీలో ఫ్రాడ్, లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త" అంటూ 'ఎక్స్' వేదికగా హెచ్చరించారు. లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను విశ్వసించవద్దని ప్రజలకు సూచించారు.

కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామని లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల దందా ఆగిపోవడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో ఇన్‌ఫ్లుయెన్సర్లు దర్శనమిస్తున్నారని వెల్లడించారు. అమాయకపు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్నారని, అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్-1978 ప్రకారం లక్కీ డ్రాల పేరుతో మోసం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లు అయినా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాప్యులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని అన్నారు.


More Telugu News