ముంబై భవిష్యత్తు క్రాస్ రోడ్స్‌లో ఉంది: బీజేపీ విజయంపై శివసేన 'సామ్నా' కథనం

  • మరాఠీల కోసం పోరాటం కొనసాగుతుందన్న 'సామ్నా' 
  • ప్రస్తుత పరిస్థితిని చూసి సంతాపం తెలపడం తప్ప ఏం చేయలేమని వ్యాఖ్య
  • ముంబై ఆత్మను కాపాడుకోవడానికి మళ్లీ పోరాటం అవసరమని అభిప్రాయం
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరియు 28 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) కూటమి విజయం సాధించగా, థాకరే కుటుంబం వెనుకబడింది. ఈ నేపథ్యంలో ముంబై ఫలితాలపై శివసేన(యూబీటీ) పార్టీ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురితమైంది. ముంబై నగరం భవిష్యత్తు ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉందని సామ్నా పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది. మరాఠీల కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొంది.

ఈవీఎంలలో తారుమారు జరిగిందని, ఓటర్లకు డబ్బులు పంచారని, బోగస్ ఓటింగ్ జరిగిందని సామ్నా విమర్శించింది. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగడాన్ని ప్రశ్నించింది. ముంబైలో మరాఠాల ప్రయోజనాలను ఎవరు కాపాడుతారని 'సామ్నా' ప్రశ్నించింది.

ఈ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీలకు తగిలిన దెబ్బలు స్వల్పమైనవే అయినప్పటికీ, ముంబై వారసత్వానికి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. ప్రాంతీయ శక్తులను బలహీనపరిచేందుకు కారకులైన వారు ముంబై నినాదాన్ని వదిలేస్తారని ఆరోపించింది. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో 106 మంది మరణించారని గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితిని చూసి సంతాపం తెలపడం తప్ప ఏమీ చేయలేమని పేర్కొంది.

ముంబై ఆత్మను కాపాడుకోవడానికి మళ్లీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ముంబై, మరాఠీ గుర్తింపును కాపాడుకోవడానికి చేయాల్సిన పోరాటం ఇంకా ముగియలేదని పేర్కొంది. బీజేపీ మద్దతుతో ముంబై నగరాన్ని కార్పొరేట్ ప్రయోజనాలకు అప్పగించే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది.

బీఎంసీ ఎన్నికల దృష్ట్యా యావత్ భారతదేశం ముంబై వైపు దృష్టి సారించిందని పేర్కొంది. అవినీతి, కుంభకోణాలు, ఈవీఎంల తారుమారు, డబ్బు పంపిణీ ద్వారా ముంబై నగరాన్ని బీజేపీ మద్దతుతో స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయని పేర్కొంది. తుది ఫలితాలు ప్రకటించకముందే విజయోత్సవాలు జరుపుకున్నారని గుర్తు చేసింది. ఇది ఎన్నికల మోసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

ప్రాంతీయ శక్తుల సంకల్పం స్థిరంగా ఉంటుందని 'సామ్నా' పేర్కొంది. అధికార పార్టీ బాలాసాహెబ్ థాకరే సైద్ధాంతిక వారసత్వాన్ని నీరుగార్చిందని, మరాఠీ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు కనీవినీ ఎరగని రీతిలో ఆర్థిక వనరులను ఉపయోగించిందని ఆరోపించింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ముంబై సాంస్కృతిక, సంప్రదాయాలను కాపాడటం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గం అవకాశవాద రాజకీయాలతో బీజేపీ మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందని పేర్కొంది.


More Telugu News